4/08/2007

నిస్వార్థ జీవనం

నేను కొన్నేళ్ళ క్రితం, స్వామీ వివేకానంద ౧౮౯౨లో అమెరికాలో ప్రపంచ మతాల సమావేశంలో చేసిన ప్రసంగం చదివాను. ఆ ప్రసంగం యొక్క ప్రతి అంశం అద్భుతమైనది. కాని అందులోని ఒక అంశం మాత్రం నాకు ఎల్లప్పుడూ ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. దానిని నేను ఎల్లప్పుడు స్మరిస్తూ ఉంటాను ఎందుకంటే ఒక విధంగా అది నాకు మనోస్థైర్యాన్ని ఇచ్చి సరైన మార్గాన్ని సూచిస్తూంటుంది. నిస్వార్థ కర్మ అంటే ప్రతి పనిని ఫలాపేక్ష లేకుండా చేయడం లోని సార్థకతను ఆనందానుభూతిని అది సూచిస్తూంటుంది. ఇంకా చెప్పాలంటే నిస్వార్థ జీవనం ఎలా ఉండాలో సూక్ష్మంగా సూచిస్తుంది స్వామీ వివేకానంద ప్రసంగంలోని ఆ అంశం.

స్వామీ వివేకానంద చేసిన ప్రసంగంలోని ఆ అంశం మహాభారత కథలోని ఒక అంశానికి సంబంధించినది - "మహాభారత కథలో శ్రీకృష్ణుడి శిష్యుడైన ధర్మరాజు రాజ్యము కోల్పోయి అడవులపాలైనాక ఒకరోజు ఆయన పత్ని ద్రౌపది ఆయనతో ఇంత ధర్మాత్ములైన మీకు ఇలాంటి దుస్థితి కలగడమేమిటి అని ప్రశ్నించింది. అప్పుడు ధర్మరాజు 'రాణీ ఆ హిమాలయ పర్వత శ్రేణులను చూడు, అవి ఎంత అందంగా, దివ్యంగా ఉన్నాయో; నేను వాటిని ప్రేమిస్తున్నాను. అవి నాకు ఏమీ ఇవ్వవు, కాని దివ్యంగా మరియు అందంగా ఉన్నవాటిని ప్రేమించడం నా స్వభావం, కనుక నేను వాటిని ప్రేమిస్తున్నాను. అలాగే నేను భగవంతుని కూడా ప్రేమిస్తాను. భగవంతుడే అన్ని అందాలకు మరియు దివ్యత్వానంతటికీ మూలం. ఆయనే ప్రేమకు ధ్యేయం, కనుక నా స్వభావానికి అనుగుణంగా నేను ఆయనను ప్రేమిస్తాను. నేను దేని గురించి ఆయనను ప్రార్థించను, ఆయనను ఏదీ అడగను. ఆయన నన్ను ఎక్కడైనా, ఎలాంటి పరిస్థితులలోనైనా ఉంచనీ. నేను కేవలం ప్రేమించడానికి మాత్రమే ఆయనను ప్రేమిస్తాను, నేను ప్రేమతో వ్యాపారం చేయలేను.' అని జవాబు ఇచ్చారు".

ఈ ప్రసంగాన్ని మననం చేసుకున్నప్పుడు, ఒక అద్భుతమైన ఆనందానుభూతి కలుగుతుంది. ఇది ప్రేమ, వాత్సల్యాలకు, నిష్కామ కర్మకు యథార్థమైన ఆదర్శం. దీనిలో భగవంతుని పై ప్రేమ, భక్తిని కూడా నిస్వార్థం మరియు నిష్కామంగా ఉంచడంలోని దివ్యత్వాన్ని సూచించారు. కాని మనం ఏమి చేస్తుంటాం? భగవంతుని పట్ల మన ఆరాధన తరచు సకామంగానే ఉంటుంది. ఇక మన నిత్య జీవితం విషయానికి వస్తే మన కుటుంబంలో వారి పై కాని లేక ఇతర వస్తువుల పై కాని, మనము చూపించే ప్రేమ కూడా తరచు ఆ ప్రేమకు బదులును ఆశిస్తూ చేసేది. మనం చేసే ప్రతి పనిలో ఏదో విధంగా ప్రతిఫలం ఆశించి చేసేదే, చివరకు మనం ఎవరికైనా ఉపకారం చేసినా, అక్కడ కూడా అవతలి వ్యక్తి మన ఉపకారానికి ప్రత్యుపకారం చేయాలనో లేక మనం చేసిన ఉపకారానికి మనకు కృతజ్ఞులై ఉండాలన్న కోరిక మన మనస్సులో ఏదో ఒక మూల దాగి ఉంటుంది. దాని వలన మనము ఆశించినది మనకు లభించనప్పుడు, లేదా మనము కోరుకున్నట్లు జరుగనప్పుడు, మనము దుఃఖానికి, ఆగ్రహానికి, అయిష్టానికి, ద్వేషానికి గురవుతాము. దాని వలన ప్రతికూలమైన దృక్పదం ఏర్పడుతుంది, సత్యాసత్యాలను తెలుసుకోకుండానే నిష్కర్షలకు వచ్చి ప్రతిక్రియాత్మకంగా మనం ప్రవర్తించడం మొదలుపెడుతూంటాము.

మన ప్రతి క్రియ ఆదర్శాలకు అనుగుణంగా కాక మన చుట్టు ప్రక్కల వాతావరణం లేక ఎదుటివారి ప్రవర్తనపై ఆధారపడి ఉంటుంది. మన కర్మలు మన వశంలో లేక బాహ్య వాతావరణానికి వశమై ఉండడమనేది ఒక విధమైన బానిసత్వానికి సూచకం. అదే కనుక మనం ఏమి ఆశించకుండా నిస్వార్థంగా ప్రేమ, వాత్సల్యాలను మన మనస్సులో పెంపొందించుకుంటే, మనం చేసే ప్రతి క్రియని నిస్వార్థంగా ఎలాంటి బదులు ఆశించకుండా చేయగలిగనట్లైతే మన చుట్టుప్రక్కల అంతా ఆనందం నిండియున్నట్లు మనకు అనిపిస్తుంది. అప్పుడు మనం మన చుట్టు ప్రక్కల వాతావరణానికి లొంగక ఆదర్శాలకు అనుగుణంగా జీవనం సాగించగలం.

No comments: