4/09/2007

సత్యమేమిటి ?

ఈ మధ్యనే కొన్ని చర్చలలో కొన్ని విషయాలు, ఆలోచనలు మరియు వాదాలను విన్న పిమ్మట నాలో కొన్ని ఆలోచనలు రేకెత్తాయి, దాని ఫలస్వరూపంగానే నేను ఈ వ్యాసాన్ని వ్రాయటం జరిగింది.

సహజమైన (అందరూ వ్వవహరించే విధానము) వ్వవహారమే (అది వాస్తవానికి సరియైనది కాకపోయినా) సరియైనదన్న భావన నేడు సాధారణ విషయమైపోయింది. చెప్పాలంటే నేడు ఎన్నో విషయాలలో తప్పు-ఒప్పుల నిర్ధారణే మారిపోయింది. జనులకు ఏది సౌకర్యంగానూ మరియు అనుకూలంగా అనిపిస్తుందో దానికి ఆనుగుణంగా తప్పు-ఒప్పుల నిర్ధారణ చేయడం జరుగుతోంది. నీతిని వైయక్తీకరణ (customization) చేయడం జరుగుతోంది, అంతటా దీనిని సరియైనదిగా భావించడం జరుగుతోంది. నీతి యొక్క వైయక్తీకరణకు ఎన్నో ఉదాహరణలు మన చుట్టూ నిత్యం కనపడుతూనే ఉంటాయి.

ఉదాహరణకు కార్యక్షేత్రాన్ని తీసుకొనవచ్చును. అక్కడ మరొక సహ ఉద్యోగస్థుడి మేలుకు బదులు మన మేలు చూసుకోవడంలో తప్పులేదన్న భావన సాధారణంగా కనపడుతుంది. ఇక్కడ నేను భారీ మోసాల గురించి మాట్లాడట్లేదన్న విషయం ధ్యాసలో ఉంచుకొనగలరు, నేను ఇక్కడ కేవలం ఇతరుల భుజాలపై స్వారీ చేసి తమ హితవును సాధించుకునే మహాశయుల గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. ఈ స్వ హిత సాధనలో ఎప్పుడైనా ఇతరులకు కూడా కొంత మేలు జరిగినా జరుగవచ్చు. కాని తప్పు-ఒప్పుల గురించి సరగ్గా వివేచించే బదులు, ఇతరులకు కూడా కొంత మంచి జరిగితే లేక చెడు జరుగక పోతే నియమాలను ఉల్లంఘించడంలో తప్పులేదన్న భావన సాధారణంగా కనపడుతుంది. కాని ఇక్కడ స్వల్ప సమయపు లాభ-నష్టాల గురించే ఆలోచన జరుగుతుంది కాని దీర్ఘకాలపు లాభ-నష్టాల గురించి వివేచన జరుగదు.

నా ధ్యాసలోకి వచ్చే మరొక ఉదాహరణ - మాంసాహార సేవనం మరియు రుచిపై సంయమన లోపం. నా ఉద్దేశ్యంలో చాలా సందర్భాలలో మాంసాహార సేవనం రుచి పై అసంయమనంతో ముడిపడియున్నది, నీతి కన్నా రుచిపై అసంయమనమే బలీయంగా ఉన్న ఎందరో శాకాహారులు చాలా సులువుగా మాంసాహారులు కాగలరు. మాంసాహారాన్ని సరియైనదిగా నిరూపించడానికి అనేక తర్కాలను కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది.

ఇలాంటివి ఎన్నో ఉదాహరణలు మనకు కనపడుతాయి. నా దృష్టిలో వీటన్నిటికి వెనుక మూల కారణం, మన సౌకర్యానికి అనుకూలంగా నీతి లేక సత్యం యొక్క నిర్ధారణను మార్చుకొనవచ్చుననే భావన. ఇది ఎలా ఉందంటే, మన వ్యవహారాలకు అనుగుణంగా నీతి లేక సత్యం యొక్క నిర్ధారణను మరల్చుకుని ఇక మనం ఏమి చేసినా సరియే అని అనుకోవడం. ఎవరైన లావుపాటి వ్యక్తి తన దేహభారం సరయైనదేనని భావించిన మాత్రాన అతడి ఇక్కట్లు తొలగిపోతాయా? అసలు మనం చేయవలసినది - నీతి లేక సత్యం యొక్క నిర్ధారణను మార్చకుండా మనను మనం నీతి లేక సత్యం యొక్క నిర్ధారణకు అనుగుణంగా మరల్చుకోవాలి.

కాని ఎక్కడైతే నీతి లేక సత్యం యొక్క విచారణ వస్తుందో అక్కడ భ్రాంతి ఉండనే ఉంటుంది. ఎందుకంటే చాలామంది ఈ విషయాల గురించి కేవలం ఉపరితలంలోనే ఆలోచిస్తారు. ఏ విధంగానైతే చెరువులోని పైతట్టు నీరు మురికిగా కనపడుతుందో లేక అలల వలన చెరువు లోతట్టు సరిగ్గా కనపడదో, అలాగే నీతి లేక సత్యం విషయంలో ఆలోచించేటప్పుడు కేవలం ఉపరితలంలోనే ఆలోచిస్తే సహజంగానే భ్రాంతి కలుగుతుంది.

సత్యాన్ని తెలుసుకొనడానికి మన అంతరంగంలోని అడుగు దాకా మునగాల్సిన అవసరమున్నది, ఎందుకంటే సత్యం మన అంతరంగంలోనే ఉంది. కేవలం అడుగు దాకా వెళ్ళి తెలుసుకొనాలన్న ప్రయత్నం కావాలి, సత్యం దానంతట అదే వెలువడుతుంది.

No comments: