4/11/2007

మన నగరాల దుఃస్థితి

పెరుగుతున్న జనాభాతోపాటు భ్రమింపజేసే పాశ్చాత్య ప్రభావితమైన జీవన పద్ధతి యొక్క దుష్ప్రభావాలు నేడు భారతదేశపు షుమారు అన్ని నగరాలలో కనపడుతూనే ఉంటాయి. ఈ పెద్ద నగరాలు, గ్రామాలనుండి పట్ణాలకు జీవనోపాధి కోసం వలసివచ్చే వారి వల్ల పెరుగుతున్న జనాభాతో ముందే కుస్తీ పడుతూ ఉంటే, ఇప్పుడు ఈ భ్రమింపజేసే జీవన పద్ధతి యొక్క భారం వల్ల నలిగిపోతున్నాయి. పరిమిత సాధనాల వల్ల ఈ నగరాలు ఈ అదనపు భారాన్ని మోసే పరిస్థితిలో ఏమాత్రం లేవు, ఇంక వీటి వ్వవస్థ చిన్నా-భిన్నమవ్వడానికి సిద్ధంగా ఉంది. ఈ నగరాల రహదారులు తప్పుడు పథకాలు మరియు నూతన జీవన పద్ధతి యొక్క భారాన్ని మోసే పరిస్థితిలో లేవు. చాలా చోట్ల 'మల్టిప్లేక్సులు' మరియ పెద్ద పెద్ద బజారుల వల్ల రహదారి రవాణా పరిస్థతి విషమిస్తోంది.
భారతీయ నగరాల 'పెరుగుతన్న ఆర్థిక వ్యవస్థ' (కొన్ని సముదాయాలది మాత్రమే), ముఖ్యంగా ఐ.టి రంగంలో పని చేసే వారి పెరిగిన ఆర్థిక స్తోమత పరిస్థితి ఇలా విషమించడానికి ఒక కారణం. ఆర్థిక స్తోమత పెరగడం మూలాన సమస్యలు రావడం అనేది ఒక విరుద్ధోక్తియే. కాని పెరిగిన ఆర్థిక స్తోమత వలన అవసరాలకు మించిన ధనం ఏకత్రితమయ్యింది. కనుక ఈ ధనాన్ని వెచ్చించే సాధనాలు కూడా కావాలి మరి! ఈ సాధనాలు వారి అలసట తీర్చే 'మల్టిప్లెక్సులు' మరియు పెద్ద పెద్ద బజారుల రూపంలో అవతరించాయి. వారి జీవన పద్ధతి ఎలా తయ్యారయ్యిందంటే, నిత్యావసర సరుకులు ఇతర స్థానాల్లో (ఒక్కోసారి వారి నివాస స్థానాలకు దగ్గరలోనే) తక్కువ ధరలకు లభ్యమవుతున్నా పెద్ద బజారులకు వెళ్ళి కొనడానికే ఇష్టపడతారు, ఎందుకంటే వారికి ఆ స్తోమత ఉంది కనుక! ఈ మల్టిప్లెక్సులు వారి వినోదం యొక్క సాధనాలే కాక ఎంత ఆకర్షణీయమైనవంటే వాటి వల్ల వారి సృజనాత్మక శక్తి నశిస్తోంది. ఇక ఈ మల్టిప్లెక్సులు మరియు పెద్ద బజారులు ఎలాగో నగర మధ్యలోనే ఉండాలి కనుక రవాణాపై ప్రభావం తథ్యం.
ఈ పరిస్థితికి ఒక కారణం ప్రభుత్వాల యోచనారాహిత్యం అయితే మరో కారణం తమ అవసరాలను విచ్చలవిడిగా పెంచుకుంటూ పోతున్న నగరాలలోని సంపన్నవర్గం. ఒక ప్రక్క ప్రభుత్వాలు పౌర రవాణా సౌకర్యాలను మెరుగు పరచడానికి సక్రియ కార్యక్రమాలను చేపట్టాల్సిన అవసరం ఉంది, అలాగే మల్టిప్లెక్సులు మరియు పెద్ద బజారులకు అనుమతి ఇచ్చే ముందు రవాణా మరియు పార్కింగ్ సౌకర్యలను గురించి యోచించాల్సిన అవసరం ఉంది. మరో ప్రక్క, తమ జీవన పద్ధతి సరైనదేనా కాదా మరియు నగరాల ఈ దుఃస్థితికి వారి జీవన పద్ధతి ఎంతవరకు కారణం అని సంపన్నవర్గాల వారు ఆలోచించాలి.
నగరాలలోని రహదారుల దుఃస్థితికి మరియు ఈ స్థితిని ఇంకా విషమింపజేయడానికి ఒక కారణం, నగరవాసులు తమ అవసరాలను పెంచుకుంటూపోతున్నారన్నదానికి మరో నిదర్శనం, ప్రజల సొంత వాహనాలు - ముఖ్యంగా కార్లు. ఇప్పుడు కారు ఉంచుకోవడం అనేది అవసరం కన్నా ఎక్కువ 'స్టేటస్ సింబల్' గా మారిపోయింది. కొన్ని సందర్భాలలో ఒకే కుటుంబంలో ఒకటి కన్నా ఎక్కువ కార్లు ఉంటే, చాలా సందర్భాలలో ఒకరి కన్నా ఎక్కువ మంది రవాణాకై ఉపయోగపడే పరిస్థితులలో కూడా ఈ కార్లను కేవలం ఒక్కరి ప్రయాణం కొరకే ఉపయోగించడం కనపడుతూ ఉంటుంది. ఒక సర్వేక్షణ ప్రకారం హైదరాబాదు లాంటి పట్టణంలో ౧.౬౭ లక్ష కార్లు ఉన్నాయి, అలాగే ఒక అంచనా ప్రకారం హైదరాబాదులో ప్రతి కిలోమీటరుకి ౨౩౩౭ వాహనాలు (అన్ని రకాలవి) తిరుగుతున్నాయి, ఈ విషయంలో హైదరాబాదు భారతదేశపు అన్ని నగరాలలో అగ్రగాణిగా ఉంది! పరిస్థితి ఎంత గంభీరంగా ఉందో, మన అవసరాలను విచ్చలవిడిగా పెంచుకుంటూపోవడంలోని మన వెర్రి పరుగు ఎలాంటి దుష్ప్రభావాలను తెస్తోందో దీనితోనే అర్థం చేసుకోవచ్చు. దీని ప్రభావం కేవలం రవాణా వ్యవస్థ పైన పడడమే కాక కాలుష్యం మరియు ఈంధనం యొక్క అపవ్యయానికి కూడా ఇది కారణమవుతోంది. ఇకనైనా మనం మన బుద్ధిని ఉపయోగించి మన అవసరాలను వ్యర్థ వ్యయాన్ని నియత్రంచుకునే ప్రయత్నం చేయాలి, లేకుంటే పరిస్థితి కోలుకోలేనంత దుఃస్థితికి దిగజారిపోతుంది.

No comments: