4/11/2007

మన నగరాల దుఃస్థితి

పెరుగుతున్న జనాభాతోపాటు భ్రమింపజేసే పాశ్చాత్య ప్రభావితమైన జీవన పద్ధతి యొక్క దుష్ప్రభావాలు నేడు భారతదేశపు షుమారు అన్ని నగరాలలో కనపడుతూనే ఉంటాయి. ఈ పెద్ద నగరాలు, గ్రామాలనుండి పట్ణాలకు జీవనోపాధి కోసం వలసివచ్చే వారి వల్ల పెరుగుతున్న జనాభాతో ముందే కుస్తీ పడుతూ ఉంటే, ఇప్పుడు ఈ భ్రమింపజేసే జీవన పద్ధతి యొక్క భారం వల్ల నలిగిపోతున్నాయి. పరిమిత సాధనాల వల్ల ఈ నగరాలు ఈ అదనపు భారాన్ని మోసే పరిస్థితిలో ఏమాత్రం లేవు, ఇంక వీటి వ్వవస్థ చిన్నా-భిన్నమవ్వడానికి సిద్ధంగా ఉంది. ఈ నగరాల రహదారులు తప్పుడు పథకాలు మరియు నూతన జీవన పద్ధతి యొక్క భారాన్ని మోసే పరిస్థితిలో లేవు. చాలా చోట్ల 'మల్టిప్లేక్సులు' మరియ పెద్ద పెద్ద బజారుల వల్ల రహదారి రవాణా పరిస్థతి విషమిస్తోంది.
భారతీయ నగరాల 'పెరుగుతన్న ఆర్థిక వ్యవస్థ' (కొన్ని సముదాయాలది మాత్రమే), ముఖ్యంగా ఐ.టి రంగంలో పని చేసే వారి పెరిగిన ఆర్థిక స్తోమత పరిస్థితి ఇలా విషమించడానికి ఒక కారణం. ఆర్థిక స్తోమత పెరగడం మూలాన సమస్యలు రావడం అనేది ఒక విరుద్ధోక్తియే. కాని పెరిగిన ఆర్థిక స్తోమత వలన అవసరాలకు మించిన ధనం ఏకత్రితమయ్యింది. కనుక ఈ ధనాన్ని వెచ్చించే సాధనాలు కూడా కావాలి మరి! ఈ సాధనాలు వారి అలసట తీర్చే 'మల్టిప్లెక్సులు' మరియు పెద్ద పెద్ద బజారుల రూపంలో అవతరించాయి. వారి జీవన పద్ధతి ఎలా తయ్యారయ్యిందంటే, నిత్యావసర సరుకులు ఇతర స్థానాల్లో (ఒక్కోసారి వారి నివాస స్థానాలకు దగ్గరలోనే) తక్కువ ధరలకు లభ్యమవుతున్నా పెద్ద బజారులకు వెళ్ళి కొనడానికే ఇష్టపడతారు, ఎందుకంటే వారికి ఆ స్తోమత ఉంది కనుక! ఈ మల్టిప్లెక్సులు వారి వినోదం యొక్క సాధనాలే కాక ఎంత ఆకర్షణీయమైనవంటే వాటి వల్ల వారి సృజనాత్మక శక్తి నశిస్తోంది. ఇక ఈ మల్టిప్లెక్సులు మరియు పెద్ద బజారులు ఎలాగో నగర మధ్యలోనే ఉండాలి కనుక రవాణాపై ప్రభావం తథ్యం.
ఈ పరిస్థితికి ఒక కారణం ప్రభుత్వాల యోచనారాహిత్యం అయితే మరో కారణం తమ అవసరాలను విచ్చలవిడిగా పెంచుకుంటూ పోతున్న నగరాలలోని సంపన్నవర్గం. ఒక ప్రక్క ప్రభుత్వాలు పౌర రవాణా సౌకర్యాలను మెరుగు పరచడానికి సక్రియ కార్యక్రమాలను చేపట్టాల్సిన అవసరం ఉంది, అలాగే మల్టిప్లెక్సులు మరియు పెద్ద బజారులకు అనుమతి ఇచ్చే ముందు రవాణా మరియు పార్కింగ్ సౌకర్యలను గురించి యోచించాల్సిన అవసరం ఉంది. మరో ప్రక్క, తమ జీవన పద్ధతి సరైనదేనా కాదా మరియు నగరాల ఈ దుఃస్థితికి వారి జీవన పద్ధతి ఎంతవరకు కారణం అని సంపన్నవర్గాల వారు ఆలోచించాలి.
నగరాలలోని రహదారుల దుఃస్థితికి మరియు ఈ స్థితిని ఇంకా విషమింపజేయడానికి ఒక కారణం, నగరవాసులు తమ అవసరాలను పెంచుకుంటూపోతున్నారన్నదానికి మరో నిదర్శనం, ప్రజల సొంత వాహనాలు - ముఖ్యంగా కార్లు. ఇప్పుడు కారు ఉంచుకోవడం అనేది అవసరం కన్నా ఎక్కువ 'స్టేటస్ సింబల్' గా మారిపోయింది. కొన్ని సందర్భాలలో ఒకే కుటుంబంలో ఒకటి కన్నా ఎక్కువ కార్లు ఉంటే, చాలా సందర్భాలలో ఒకరి కన్నా ఎక్కువ మంది రవాణాకై ఉపయోగపడే పరిస్థితులలో కూడా ఈ కార్లను కేవలం ఒక్కరి ప్రయాణం కొరకే ఉపయోగించడం కనపడుతూ ఉంటుంది. ఒక సర్వేక్షణ ప్రకారం హైదరాబాదు లాంటి పట్టణంలో ౧.౬౭ లక్ష కార్లు ఉన్నాయి, అలాగే ఒక అంచనా ప్రకారం హైదరాబాదులో ప్రతి కిలోమీటరుకి ౨౩౩౭ వాహనాలు (అన్ని రకాలవి) తిరుగుతున్నాయి, ఈ విషయంలో హైదరాబాదు భారతదేశపు అన్ని నగరాలలో అగ్రగాణిగా ఉంది! పరిస్థితి ఎంత గంభీరంగా ఉందో, మన అవసరాలను విచ్చలవిడిగా పెంచుకుంటూపోవడంలోని మన వెర్రి పరుగు ఎలాంటి దుష్ప్రభావాలను తెస్తోందో దీనితోనే అర్థం చేసుకోవచ్చు. దీని ప్రభావం కేవలం రవాణా వ్యవస్థ పైన పడడమే కాక కాలుష్యం మరియు ఈంధనం యొక్క అపవ్యయానికి కూడా ఇది కారణమవుతోంది. ఇకనైనా మనం మన బుద్ధిని ఉపయోగించి మన అవసరాలను వ్యర్థ వ్యయాన్ని నియత్రంచుకునే ప్రయత్నం చేయాలి, లేకుంటే పరిస్థితి కోలుకోలేనంత దుఃస్థితికి దిగజారిపోతుంది.

4/09/2007

సత్యమేమిటి ?

ఈ మధ్యనే కొన్ని చర్చలలో కొన్ని విషయాలు, ఆలోచనలు మరియు వాదాలను విన్న పిమ్మట నాలో కొన్ని ఆలోచనలు రేకెత్తాయి, దాని ఫలస్వరూపంగానే నేను ఈ వ్యాసాన్ని వ్రాయటం జరిగింది.

సహజమైన (అందరూ వ్వవహరించే విధానము) వ్వవహారమే (అది వాస్తవానికి సరియైనది కాకపోయినా) సరియైనదన్న భావన నేడు సాధారణ విషయమైపోయింది. చెప్పాలంటే నేడు ఎన్నో విషయాలలో తప్పు-ఒప్పుల నిర్ధారణే మారిపోయింది. జనులకు ఏది సౌకర్యంగానూ మరియు అనుకూలంగా అనిపిస్తుందో దానికి ఆనుగుణంగా తప్పు-ఒప్పుల నిర్ధారణ చేయడం జరుగుతోంది. నీతిని వైయక్తీకరణ (customization) చేయడం జరుగుతోంది, అంతటా దీనిని సరియైనదిగా భావించడం జరుగుతోంది. నీతి యొక్క వైయక్తీకరణకు ఎన్నో ఉదాహరణలు మన చుట్టూ నిత్యం కనపడుతూనే ఉంటాయి.

ఉదాహరణకు కార్యక్షేత్రాన్ని తీసుకొనవచ్చును. అక్కడ మరొక సహ ఉద్యోగస్థుడి మేలుకు బదులు మన మేలు చూసుకోవడంలో తప్పులేదన్న భావన సాధారణంగా కనపడుతుంది. ఇక్కడ నేను భారీ మోసాల గురించి మాట్లాడట్లేదన్న విషయం ధ్యాసలో ఉంచుకొనగలరు, నేను ఇక్కడ కేవలం ఇతరుల భుజాలపై స్వారీ చేసి తమ హితవును సాధించుకునే మహాశయుల గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. ఈ స్వ హిత సాధనలో ఎప్పుడైనా ఇతరులకు కూడా కొంత మేలు జరిగినా జరుగవచ్చు. కాని తప్పు-ఒప్పుల గురించి సరగ్గా వివేచించే బదులు, ఇతరులకు కూడా కొంత మంచి జరిగితే లేక చెడు జరుగక పోతే నియమాలను ఉల్లంఘించడంలో తప్పులేదన్న భావన సాధారణంగా కనపడుతుంది. కాని ఇక్కడ స్వల్ప సమయపు లాభ-నష్టాల గురించే ఆలోచన జరుగుతుంది కాని దీర్ఘకాలపు లాభ-నష్టాల గురించి వివేచన జరుగదు.

నా ధ్యాసలోకి వచ్చే మరొక ఉదాహరణ - మాంసాహార సేవనం మరియు రుచిపై సంయమన లోపం. నా ఉద్దేశ్యంలో చాలా సందర్భాలలో మాంసాహార సేవనం రుచి పై అసంయమనంతో ముడిపడియున్నది, నీతి కన్నా రుచిపై అసంయమనమే బలీయంగా ఉన్న ఎందరో శాకాహారులు చాలా సులువుగా మాంసాహారులు కాగలరు. మాంసాహారాన్ని సరియైనదిగా నిరూపించడానికి అనేక తర్కాలను కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది.

ఇలాంటివి ఎన్నో ఉదాహరణలు మనకు కనపడుతాయి. నా దృష్టిలో వీటన్నిటికి వెనుక మూల కారణం, మన సౌకర్యానికి అనుకూలంగా నీతి లేక సత్యం యొక్క నిర్ధారణను మార్చుకొనవచ్చుననే భావన. ఇది ఎలా ఉందంటే, మన వ్యవహారాలకు అనుగుణంగా నీతి లేక సత్యం యొక్క నిర్ధారణను మరల్చుకుని ఇక మనం ఏమి చేసినా సరియే అని అనుకోవడం. ఎవరైన లావుపాటి వ్యక్తి తన దేహభారం సరయైనదేనని భావించిన మాత్రాన అతడి ఇక్కట్లు తొలగిపోతాయా? అసలు మనం చేయవలసినది - నీతి లేక సత్యం యొక్క నిర్ధారణను మార్చకుండా మనను మనం నీతి లేక సత్యం యొక్క నిర్ధారణకు అనుగుణంగా మరల్చుకోవాలి.

కాని ఎక్కడైతే నీతి లేక సత్యం యొక్క విచారణ వస్తుందో అక్కడ భ్రాంతి ఉండనే ఉంటుంది. ఎందుకంటే చాలామంది ఈ విషయాల గురించి కేవలం ఉపరితలంలోనే ఆలోచిస్తారు. ఏ విధంగానైతే చెరువులోని పైతట్టు నీరు మురికిగా కనపడుతుందో లేక అలల వలన చెరువు లోతట్టు సరిగ్గా కనపడదో, అలాగే నీతి లేక సత్యం విషయంలో ఆలోచించేటప్పుడు కేవలం ఉపరితలంలోనే ఆలోచిస్తే సహజంగానే భ్రాంతి కలుగుతుంది.

సత్యాన్ని తెలుసుకొనడానికి మన అంతరంగంలోని అడుగు దాకా మునగాల్సిన అవసరమున్నది, ఎందుకంటే సత్యం మన అంతరంగంలోనే ఉంది. కేవలం అడుగు దాకా వెళ్ళి తెలుసుకొనాలన్న ప్రయత్నం కావాలి, సత్యం దానంతట అదే వెలువడుతుంది.

4/08/2007

నిస్వార్థ జీవనం

నేను కొన్నేళ్ళ క్రితం, స్వామీ వివేకానంద ౧౮౯౨లో అమెరికాలో ప్రపంచ మతాల సమావేశంలో చేసిన ప్రసంగం చదివాను. ఆ ప్రసంగం యొక్క ప్రతి అంశం అద్భుతమైనది. కాని అందులోని ఒక అంశం మాత్రం నాకు ఎల్లప్పుడూ ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. దానిని నేను ఎల్లప్పుడు స్మరిస్తూ ఉంటాను ఎందుకంటే ఒక విధంగా అది నాకు మనోస్థైర్యాన్ని ఇచ్చి సరైన మార్గాన్ని సూచిస్తూంటుంది. నిస్వార్థ కర్మ అంటే ప్రతి పనిని ఫలాపేక్ష లేకుండా చేయడం లోని సార్థకతను ఆనందానుభూతిని అది సూచిస్తూంటుంది. ఇంకా చెప్పాలంటే నిస్వార్థ జీవనం ఎలా ఉండాలో సూక్ష్మంగా సూచిస్తుంది స్వామీ వివేకానంద ప్రసంగంలోని ఆ అంశం.

స్వామీ వివేకానంద చేసిన ప్రసంగంలోని ఆ అంశం మహాభారత కథలోని ఒక అంశానికి సంబంధించినది - "మహాభారత కథలో శ్రీకృష్ణుడి శిష్యుడైన ధర్మరాజు రాజ్యము కోల్పోయి అడవులపాలైనాక ఒకరోజు ఆయన పత్ని ద్రౌపది ఆయనతో ఇంత ధర్మాత్ములైన మీకు ఇలాంటి దుస్థితి కలగడమేమిటి అని ప్రశ్నించింది. అప్పుడు ధర్మరాజు 'రాణీ ఆ హిమాలయ పర్వత శ్రేణులను చూడు, అవి ఎంత అందంగా, దివ్యంగా ఉన్నాయో; నేను వాటిని ప్రేమిస్తున్నాను. అవి నాకు ఏమీ ఇవ్వవు, కాని దివ్యంగా మరియు అందంగా ఉన్నవాటిని ప్రేమించడం నా స్వభావం, కనుక నేను వాటిని ప్రేమిస్తున్నాను. అలాగే నేను భగవంతుని కూడా ప్రేమిస్తాను. భగవంతుడే అన్ని అందాలకు మరియు దివ్యత్వానంతటికీ మూలం. ఆయనే ప్రేమకు ధ్యేయం, కనుక నా స్వభావానికి అనుగుణంగా నేను ఆయనను ప్రేమిస్తాను. నేను దేని గురించి ఆయనను ప్రార్థించను, ఆయనను ఏదీ అడగను. ఆయన నన్ను ఎక్కడైనా, ఎలాంటి పరిస్థితులలోనైనా ఉంచనీ. నేను కేవలం ప్రేమించడానికి మాత్రమే ఆయనను ప్రేమిస్తాను, నేను ప్రేమతో వ్యాపారం చేయలేను.' అని జవాబు ఇచ్చారు".

ఈ ప్రసంగాన్ని మననం చేసుకున్నప్పుడు, ఒక అద్భుతమైన ఆనందానుభూతి కలుగుతుంది. ఇది ప్రేమ, వాత్సల్యాలకు, నిష్కామ కర్మకు యథార్థమైన ఆదర్శం. దీనిలో భగవంతుని పై ప్రేమ, భక్తిని కూడా నిస్వార్థం మరియు నిష్కామంగా ఉంచడంలోని దివ్యత్వాన్ని సూచించారు. కాని మనం ఏమి చేస్తుంటాం? భగవంతుని పట్ల మన ఆరాధన తరచు సకామంగానే ఉంటుంది. ఇక మన నిత్య జీవితం విషయానికి వస్తే మన కుటుంబంలో వారి పై కాని లేక ఇతర వస్తువుల పై కాని, మనము చూపించే ప్రేమ కూడా తరచు ఆ ప్రేమకు బదులును ఆశిస్తూ చేసేది. మనం చేసే ప్రతి పనిలో ఏదో విధంగా ప్రతిఫలం ఆశించి చేసేదే, చివరకు మనం ఎవరికైనా ఉపకారం చేసినా, అక్కడ కూడా అవతలి వ్యక్తి మన ఉపకారానికి ప్రత్యుపకారం చేయాలనో లేక మనం చేసిన ఉపకారానికి మనకు కృతజ్ఞులై ఉండాలన్న కోరిక మన మనస్సులో ఏదో ఒక మూల దాగి ఉంటుంది. దాని వలన మనము ఆశించినది మనకు లభించనప్పుడు, లేదా మనము కోరుకున్నట్లు జరుగనప్పుడు, మనము దుఃఖానికి, ఆగ్రహానికి, అయిష్టానికి, ద్వేషానికి గురవుతాము. దాని వలన ప్రతికూలమైన దృక్పదం ఏర్పడుతుంది, సత్యాసత్యాలను తెలుసుకోకుండానే నిష్కర్షలకు వచ్చి ప్రతిక్రియాత్మకంగా మనం ప్రవర్తించడం మొదలుపెడుతూంటాము.

మన ప్రతి క్రియ ఆదర్శాలకు అనుగుణంగా కాక మన చుట్టు ప్రక్కల వాతావరణం లేక ఎదుటివారి ప్రవర్తనపై ఆధారపడి ఉంటుంది. మన కర్మలు మన వశంలో లేక బాహ్య వాతావరణానికి వశమై ఉండడమనేది ఒక విధమైన బానిసత్వానికి సూచకం. అదే కనుక మనం ఏమి ఆశించకుండా నిస్వార్థంగా ప్రేమ, వాత్సల్యాలను మన మనస్సులో పెంపొందించుకుంటే, మనం చేసే ప్రతి క్రియని నిస్వార్థంగా ఎలాంటి బదులు ఆశించకుండా చేయగలిగనట్లైతే మన చుట్టుప్రక్కల అంతా ఆనందం నిండియున్నట్లు మనకు అనిపిస్తుంది. అప్పుడు మనం మన చుట్టు ప్రక్కల వాతావరణానికి లొంగక ఆదర్శాలకు అనుగుణంగా జీవనం సాగించగలం.

2/04/2007

మనం ఏం చేస్తున్నాం

మనలో చాలా మంది తమ నిత్య జీవితంలోని కార్యాలు, జీవితంలో జరిగే నిత్య సంఘటనలతోనే వ్యస్థత చెంది ఉన్నారు. మన నిత్య జీవితంలో లేక కార్యక్షేత్రంలో కలిగే ఒడిదుడుకులను ఎదుర్కొనటం, ఆ విషయాల గురించి ఆలోచించి వాటి గురించి పని చేయడంలోనే మనం సతమౌతూ ఉంటాము. ఇక మనలో ఇంకొందరికి మన సన్నిహిత కుటుంబం వారు మరియు స్నేహితులకు సంబంధించిన విషయాల గురించి మరియు సంఘటనల గురించి మాత్రమే పరిజ్ఞానం కలదు. మన సన్నిహితులకి సంబంధించిన ఒడిదుడుకుల గురించి కూడా మనం సతమౌతూ ఉంటాము, ఆ విషయాల ఫలితాలకు అనుగుణంగా మనకు హర్షం లేక దుఃఖం లభిస్తూ ఉంటాయి. అంతే తప్ప మన సమాజానికి సంబంధించిన విషయాలపై మనలో అతి కొద్ది మందికి మాత్రమే శ్రద్ధ ఉంటుంది. ఒకవేళ ఆ విషయాల గురించిన పరిజ్ఞానం ఉన్నా అతి కొద్ది మంది మాత్రమే ఆ దిశగా పని చేస్తున్నా, అందులోనూ అధిక శాతం వ్యక్తిగత కారణాల వల్ల ఒక్కోసారి తమ దిశను మరుస్తూ ఉంటారు. కాని ఒక్క విషయం మనం అందరం మరవకూడనిదేమిటంటే మనం నిజమైన ఆనందాన్ని కోరుకుంటే అది నిస్వార్థ సేవాకార్యాల వల్లనే లభిస్తుంది. అలాంటి నిస్వార్థ సేవ చేసేటప్పుడు తమ-తర భేదం నశించి అందరి యందు సమదృష్టి కలుగుతుంది, అది చివరకు నిత్యానందానికి మార్గంగా మారుతుంది.